: పాకిస్థాన్ కొత్త ఆర్మీ చీఫ్ నియామకంలో రాజకీయాలు.. రసకందాయంలో నియామకం!
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ పదవీ కాలం నవంబర్ నెలాఖరుతో ముగియనుండడంతో కొత్త ఆర్మీ చీఫ్ గా ఎవరిని నియమిస్తారనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. పాక్ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించే పాక్ ఆర్మీ చీఫ్ గా ప్రధాని నవాజ్ షరీఫ్ సూచించిన వ్యక్తి నియమితమవుతాడా? లేక త్వరలో రిటైర్ కానున్న రహీల్ షరీఫ్ సూచించిన వ్యక్తి నియమితుడవుతాడా? అన్నది ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం కార్ప్స్ కమాండర్ గా కొనసాగుతున్న జావెద్ ఇక్బాల్ రాండేను కొత్త ఆర్మీ చీఫ్ గా నియమించాలని నవాజ్ షరీఫ్ భావిస్తుండగా, రహీల్ షరీఫ్ జనరల్ జుబైర్ మహమూద్ హయత్ వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో వీరిద్దరిలోనూ ఎవరినైనానా? లేక రేసులో ఉన్న లెఫ్టినెంట్ జనరళ్లు నదీమ్ అహ్మద్, కమర్ బజ్వా లలో ఎవరినైనా నియమించనున్నారా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక్బాల్ రాండే నవాజ్ షరీఫ్ కు విశ్వసనీయుడు. అంతే కాకుండా ఆయన కుటుంబం చాలా కాలంగా నవాజ్ షరీఫ్ పార్టీలో కొనసాగుతోంది. దీంతో ఆయనను ఆర్మీ చీఫ్ గా నియమిస్తే...ఇంత వరకు ఆర్మీతో ఉన్న ఘర్షణపూరిత వాతావరణం కాస్త సానుకూలంగా మారుతుందని ఆయన అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, సీనియర్ ఆర్మీ జనరళ్లను కాదని నవాజ్ షరీఫ్ గతంలో పర్వేజ్ ముషారఫ్ ను ఆర్మీ జనరల్ గా చేయగా, ఎదురు తిరిగిన ముషారఫ్...అతనిని బలవంతంగా గద్దెదించి అధ్యక్షుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ నూతన సైన్యాధ్యక్షుడు ఎవరు? అనే దానిపై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.