: బీజేపీ ఏపీ అధ్యక్షుడికి విజయవాడ శాఖ షాక్
ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడ నగర శాఖ తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకుని, ఆయనకు షాకిచ్చింది. బీజేపీ మంత్రి చేతిలో ఉన్న దేవాదాయశాఖలో నామినేటెడ్ పోస్టులను బీజేపీ నేతలకు కేటాయించడం లేదంటూ విజయవాడ నగర బీజేపీ శాఖ అధ్యక్షుడు ఉమామహేశ్వరరాజు ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిపై కన్నెర్ర చేసిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఆయనను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో హరిబాబుకు వ్యతిరేకంగా విజయవాడలోని అన్ని డివిజన్ల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఉమామహేశ్వరరాజు సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. అంతే కాకుండా ఉమామహేశ్వరరాజునే నగర అధ్యక్షుడిగా అంగీకరిస్తున్నామంటూ, ఏపీకి కొత్త అధ్యక్షుడు వచ్చేవరకు ఈయనే నగరశాఖ అధ్యక్షుడిగా కొనసాగుతారంటూ ఇంకో తీర్మానాన్ని ఆమోదించారు. ఈ రెండు తీర్మానాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు పంపించనున్నట్టు వారు తెలిపారు. దీంతో విజయవాడ బీజేపీ వైఖరితో ఆ పార్టీలో ముసలం బయల్దేరినట్టైంది.