: కాపు రిజర్వేషన్ ఉద్యమం తీవ్రతరం: ముద్రగడ
కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ముద్రగడ పద్మనాభం తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కాపు రిజర్వేషన్ ఉద్యమం తీవ్రం చేసేందుకు జాతి నేతలంతా సమావేశమయ్యామని అన్నారు. జాతి కోసం ఏకమయ్యేందుకు నేతలంతా సిద్ధమయ్యారని, వారి అడుగుజాడల్లో నడిచేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. తాటాకు చప్పుళ్ల కోసం తాను ఉద్యమం మొదలుపెట్టలేదని, త్వరలోనే ఏం చేస్తామో చూస్తారని ఆయన తెలిపారు. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు కాపులకు రిజర్వేషన్ అమలు చేస్తానని చెప్పండంతో తమలో చైతన్యం రగిలిందని ఆయన తెలిపారు. అప్పట్లో తాము తీసుకొచ్చిన జీవోను పక్కన పెట్టడానికి తోడు, ఓటమిపాలు కావడంతో 20 ఏళ్ల పాటు ఉద్యమానికి దూరంగా ఉన్నానని చెప్పారు. చంద్రబాబు మళ్లీ రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పడంతోనే తాను ఉద్యమం మొదలు పెట్టానని ఆయన తెలిపారు. ఇతరుల రిజర్వేషన్ కోటా తగ్గించమని కోరడం లేదని ఆయన తెలిపారు. అందరూ అనుభవించగా మిగిలిన భాగంలో కోటా కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ పోరాటంలో వెనుకంజ వేసే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. గ్రామ కమిటీలు వేస్తామని, వాటి ద్వారా ఉద్యమాన్ని పటిష్ఠం చేస్తామని ఆయన తెలిపారు. ప్రతి 15 రోజులకు తాను జిల్లా కేంద్రాలకు వెళ్లి, జిల్లా నేతలతో సమావేశమై ఉద్యమకార్యాచరణ పర్యవేక్షిస్తానని ఆయన తెలిపారు. తమ కులంలో చిచ్చుపెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, తమ సోదరులతోనే తిట్టిస్తున్నారని ఆయన తెలిపారు. వారు తిట్టినంత మాత్రాన తమ పరువులు పోవని ఆయన అన్నారు. తాను మొలతాడు తీసేసి ఉన్నానని, దేనికైనా రెడీగా ఉన్నానని ఆయన చెప్పారు.