: ఏపీ మెడికల్ సీట్ల కౌన్సెలింగ్‌లో గోల్‌మాల్ జరిగింది, 200 మంది విద్యార్థులు నష్టపోయారు: రఘువీరారెడ్డి
ఆంధప్రదేశ్‌లో మెడికల్ సీట్ల కౌన్సెలింగ్‌లో గోల్‌మాల్ జరిగిందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఈరోజు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రిజర్వేషన్ కేటగిరి విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై తాము ఈరోజు రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి, వివరించినట్లు తెలిపారు. కౌన్సిలింగ్‌లో మొత్తం 200 మంది విద్యార్థులు నష్టపోయారని ఆయన అన్నారు. ఈ అంశంపై దృష్టి సారిస్తానని గవర్నర్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకోకూడదని ఆయన వ్యాఖ్యానించారు. వారికి సీట్లు ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.