: ట్రంప్ కు మరోదెబ్బ...హిల్లరీకి ఊహించని వ్యక్తి నుంచి మద్దతు


అమెరికాలో రిపబ్లికన్ పార్టీకి చెందిన వ్యక్తి నుంచి డెమెక్రాట్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కు మద్దతు లభించింది. రిపబ్లికన్ పార్టీకి ఇద్దరు అధ్యక్షులను అందించిన బుష్ కుటుంబానికి చెందిన వ్యక్తి హిల్లరీ నిర్వహించిన నిధుల సేకరణ కార్యక్రమానికి హాజరుకావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే...న్యూయార్క్ రాష్ట్రంలోని పారిస్ లో హిల్లరీ సహాయకురాలు హుమా అబెదిన్ ఫండ్ రైజింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బార్బారా పియర్స్ బుష్ (అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ కుమార్తె) పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బార్బారా ముత్తాతల కాలం నుంచీ ఆమె కుటుంబం రిపబ్లికన్ పార్టీకి మద్దతుగా నిలుస్తోంది. ఆమె ఈ కార్యక్రమానికి వచ్చిన క్షణాల్లో సోషల్ మీడియాలో ఆమె ఫోటో వైరల్ అయింది. దీంతో హిల్లరీ క్లింటన్ కు ఊహించని విధంగా ప్రత్యర్థి పార్టీ నుంచి మద్దతు లభించినట్టైంది. ఇప్పటికే తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ ఘోరంగా విఫలమైన ట్రంప్ కు ఇది ఇబ్బందికర పరిణామమనడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. దీంతో బుష్ కుటుంబం మొత్తం హిల్లరీ వెంట ఉందని భావించవచ్చని వారు చెబుతున్నారు. గతంలో ఆమె తాత సీనియర్ బుష్ ట్రంప్ కు వ్యతిరేకంగా గళమెత్తిన సంగతి తెలిసిందే. అప్పట్లో ట్రంప్ కు వ్యతిరేకంగా తన కుమారుడు జెబ్ బుష్ పోటీ పడ్డారు. ట్రంప్ ధాటికి తాళలేని జెబ్ బుష్ అధ్యక్ష పదవికి పోటీ నుంచి తప్పుకున్నాడు. దీంతో బుష్ కుటుంబం ట్రంప్ కు వ్యతిరేకంగా పని చేస్తుందని పలువురు ఆరోపిస్తుండగా, బుష్ కుటుంబం మద్దతులేకున్నా తాను అధ్యక్షుడిగా ఎన్నికవుతానని ట్రంప్ ధీమాగా చెబుతున్నారు.

  • Loading...

More Telugu News