: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను 'హీరో'ను చేసిన పాకిస్థాన్!
‘ప్రధానమంత్రి నరేంద్రమోదీతో తాము పలు విషయాల్లో విభేదించినా ఇటీవల పీవోకేలో సర్జికల్ స్ట్రయిక్స్ విషయంలో మోదీ చూపిన మనోబలానికి సెల్యూట్ చేస్తున్నా’నంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, అదే సమయంలో ఆయన భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రయిక్స్ పై ఆధారాలు చూపి పాక్ ఆర్మీ ఆ అంశంపై చేస్తున్న అసత్యప్రచారాన్ని ఎండగట్టాలని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్నే ఆధారంగా తీసుకొని పాక్ మీడియా కేజ్రీవాల్‌ను హీరోని చేసేసింది. ఆధారాలు చూపించాలంటే కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ కథనాలు ప్రచురించింది. పీవోకేలో భారత సైన్యం అసలు సర్జికల్ స్ట్రయిక్స్ చేయనేలేదని పాకిస్థాన్ ఇప్పటికే అసత్యప్రచారం చేస్తోంది. తాజాగా కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలతో పాక్ మరింత రెచ్చిపోయింది. సర్జికల్ స్ట్రయిక్స్ చేయలేదని తాము చెబుతున్న అంశానికి కేజ్రీవాల్ వ్యాఖ్యలు బలం చేకూర్చాయని పాక్ మీడియా పేర్కొంది. ‘మోదీని నిలదీసిన హీరో కేజ్రీవాల్’ అంటూ హెడ్డింగులు పెట్టి కథనాలు ప్రచురించింది.