: ‘సచిన్’ సినిమా కోసం సచిన్ పారితోషికం తీసుకోలేదట!
క్రికెట్ లెజెండ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘సచిన్- ఏ బిలియన్ డ్రీమ్స్’. సచిన్ స్నేహితుడు రవి భాగ్ చంద్కా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే, తనపై చిత్రం తీసేందుకు సచిన్ అనుమతించడమే కాకుండా, ఆ చిత్రంలో ఆయనే స్వయంగా నటిస్తున్నాడు. తన జీవిత కథను సినిమాగా తీసేందుకు, సచిన్ నటిస్తున్నందుకు గానీ నయాపైసా కూడా రవి భాగ్ చంద్కా వద్ద తీసుకోలేదట. ఈ విషయాన్ని స్వయంగా సచిన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. కాగా, ‘సచిన్’ చిత్రంలో సచిన్ టెండూల్కర్ కుర్రాడిగా ఉన్నప్పటి పాత్రను అర్జున్ టెండూల్కర్, కుర్రవయసు దాటిన తర్వాతి పాత్రలో సచిన్ టెండూల్కర్ నటిస్తుండగా, సచిన్ అన్న నితిన్ టెండూల్కర్ పాత్రలో మయూరీష్ నటిస్తున్నారు. కాగా, టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ జీవిత కథ ఆధారంగా తీసిన ‘ఎమ్ఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ’ చిత్రం ఇటీవల విడుదలైంది. అయితే, ఈ చిత్రానికి ధోని సుమారు రూ. 40 కోట్లు తీసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.