: నిజంగా నాకు ఆశ్చర్యమనిపించింది... కరవుపై యుద్ధం చేసి గెలిచేశామని చెప్పుకున్నారు: జగన్
రెయిన్‌గన్‌లతో పంటలు పండించామని చెప్పుకుంటున్న మీ మాటలు నిజమా? అని వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈరోజు రైతు సమస్యలపై అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆయన ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘నిజంగా నాకు ఆశ్చర్యమనిపించింది... ఓవైపు రాష్ట్రంలో కరవు పరిస్థితితో రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే మీకు కరవు పరిస్థితే తెలియదన్నారు. మళ్లీ రెండు రోజుల్లో మీటింగ్ పెట్టి కరవుపై యుద్ధం చేసి గెలిచేశామని చెప్పుకున్నారు’ అని జగన్ అన్నారు. ‘రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షపాతం తక్కువగా నమోదయింది.... ఈరోజు నేను ఒక్కటి ప్రశ్నించానుకుంటున్నా.. కరవు రావడమన్నది ఎవరి చేతుల్లోనూ ఉండదు కానీ, వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఎలా స్పందించాలన్న విషయం మీకు తెలియదా? రైతులకు న్యాయం చేసే స్థితిలో ఎందుకు లేరు? రైతుల ఆత్మహత్యలు తగ్గించడానికి ఆనాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉచిత విద్యుత్ పై మొదటి సంతకం పెట్టారు. ఆ సంతకంతో వ్యవసాయంపై ఆధారపడుతున్న రైతులు ఎంతో సంతోషించారు.. అంతకు ముందు తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో రైతులకు చంద్రబాబు పోలీస్‌స్టేషన్లలో పెట్టించారు. ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలపై వైఎస్ ఢిల్లీలో హై కమాండ్‌పై ఒత్తిడి తీసుకొచ్చి వారి కష్టాలను తీర్చారు. మరి చంద్రబాబు ఇప్పుడు రైతుల కోసం ఏం చేస్తున్నారు? అని జగన్ వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలోని 250 మండలాల్లో కరవు తాండవిస్తోంది. ఎన్నికల ప్రచారసభల్లో రైతులకు న్యాయం చేస్తానని చెప్పారు.. ఇప్పుడు వారి కష్టాలను పట్టించుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వకుండా రైతుల నోట్లో మట్టి కొట్టారు. మాధవరంలో చంద్రబాబు ఏ పొలంలోనయితే రెయిన్‌గన్స్ ప్రారంభించారో ఆ పొలమే ఇప్పుడు ఎండిపోయి కనిపిస్తోంది.. ఇన్‌పుట్ సబ్సిడీలో ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. పంట బీమా కూడా దక్కని పరిస్థితి రాష్ట్రంలో ఉంది’ అని జగన్ అన్నారు.