: దమ్ముంటే యుద్ధం చేయండి: నరేంద్ర మోదీకి జావేద్ మియాందాద్ చాలెంజ్
భారత్, పాకిస్థాన్ ల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితిని మరింతగా పెంచేలా పాక్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ నోరు పారేసుకున్నాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి దమ్ముంటే యుద్ధాన్ని ప్రారంభించాలని సవాల్ విసిరాడు. ఓ పాకిస్థాన్ టీవీ చానల్ తో మాట్లాడిన ఆయన, దేశం కోసం తామంతా ప్రాణ త్యాగానికి సిద్ధమని, ఉత్తుత్తి దాడుల బెదిరింపులతో పాక్ భయపడబోదని, చేతనైనే ప్రత్యక్ష యుద్ధానికి దిగాలని అన్నాడు. భారతీయులు పిరికిపందలని, చర్య తీసుకోవడమే సరైన ప్రతిచర్య అవుతుందని అన్నాడు. కాగా, తాను క్రికెట్ ఆడుతున్న రోజుల్లో వివాదాస్పద చర్యలతో అభిమానులకు గుర్తుండిపోయిన జావేద్ చేసిన తాజా వ్యాఖ్యలపై ఇతర పాకిస్థానీ క్రికెటర్లు ఎలా స్పందిస్తారన్నది చూడాలి. ఇటీవలే విధ్వంసక బ్యాట్స్ మన్ షాహీద్ అఫ్రీది పాక్ శాంతికాముక దేశమని, యుద్ధాల గురించి మాట్లాడకుండా చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించాడు. ఈ నేపథ్యంలో మియాందాద్ వ్యాఖ్యలపై ఎవరు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.