: రాజకీయ ఉనికి కోసమే జగన్ ఆరాటం: ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి
రైతు సమస్యలపై అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధర్నాకు దిగారు. ఈ అంశంపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథరెడ్డి జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోతోన్న వైసీపీ రాజకీయ ఉనికి కోసమే ఆరాటపడుతోందని, అందుకే ఇటువంటి ధర్నాలకు దిగుతోందని అన్నారు. అనంతపురం జిల్లాను కరవురహిత జిల్లాగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకే జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, బ్రోకర్ల మాయమాటలు నమ్మి ప్రజలు గల్ఫ్ దేశాలకు వెళుతున్నారని రఘునాథ్‌రెడ్డి అన్నారు. వారి మాటలు నమ్మి మోసపోకూడదని, ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఏజెన్సీలనే ప్రజలు సంప్రదించాలని ఆయన సూచించారు.