: మరో దారిలేదు... అన్ని క్రికెట్ మ్యాచ్ లనూ రద్దు చేసేస్తాం: కీలక హెచ్చరిక చేసిన బీసీసీఐ
న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్, జరగాల్సిన వన్డే సిరీస్ లను, ఆపై భవిష్యత్తులో భారత జట్టు ఆడే మ్యాచ్ లనూ రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్టు బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. "మా ముందు సిరీస్ ను రద్దు చేయడం మినహా మరో మార్గం కనిపించడం లేదు. ఈ మ్యాచ్ లను నిర్వహించేందుకు మా వద్ద డబ్బులేదు. ఖర్చులన్నీ ఎవరు భరిస్తారు? లోధా కమిటీ చాలా ఎక్కువ చేస్తోంది. ఆటగాళ్లకు డబ్బులివ్వకుండా మ్యాచ్ లు జరుగుతాయా? డబ్బులు తీసుకోకుండా మూడో టెస్టును ఆడేందుకు ప్లేయర్లు సిద్ధమైతే మాకూ సంతోషమే. అప్పుడే మ్యాచ్ జరుగుతుంది" అని బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అన్ని దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్ పోటీలను బలవంతంగా రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్క మ్యాచ్ కూడా జరిగే అవకాశం లేదని ఆయన అన్నారు.. బీసీసీఐని లోథా కమిటీ నిర్ణయాలు బాధిస్తున్నాయని తెలిపారు. కాగా, మూడో టెస్టును రద్దు చేస్తున్నట్టు బీసీసీఐ నుంచి ఇంతవరకూ ఎలాంటి సమాచారమూ రాలేదని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది.