: భారత పర్యటనకు వచ్చి కాన్వాయ్ వద్దంటూ, బస్సెక్కిన సింగపూర్ ప్రధాని
ఐదు రోజుల భారత పర్యటన నిమిత్తం న్యూఢిల్లీకి వచ్చిన సింగపూర్ ప్రధాని లీ సైన్ లూంగ్, ప్రొటోకాల్ పక్కనబెట్టి, భారీ కాన్వాయ్ ని విడిచి, ఇతర అధికారుల కోసం ఏర్పాటు చేసిన బస్సులోనే తాను బస చేయాల్సిన హోటల్ కు వెళ్లిపోయారు. సింగపూర్ దేశంలో ప్రజా రవాణాతో పోలిస్తే వ్యక్తిగత వాహన వినియోగం చాలా తక్కువ. అందుకే లీ సైన్ కూడా కాన్వాయ్ బదులు బస్సును ఎంచుకున్నారు. ఇక తన పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, భద్రతాంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు మంత్రులు, అధికారులతో ఆయన సమావేశం కానున్నారు. కొన్ని ఒప్పందాలపైనా మోదీ, లీ సైన్ ల సమక్షంలో సంతకాలు జరగనున్నాయి. లూంగ్ తో ఆయన భార్య హో షింగ్ సైతం భారత్ లో పర్యటిస్తున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చే ప్రత్యేక విందులో పాల్గొనే సింగపూర్ ప్రధాని, ఆపై రెండు రోజుల పాటు రాజస్థాన్ లో పర్యటించనున్నారు.