: డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న శాస్త్రవేత్త అరెస్ట్.. రూ.231 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న శాస్త్రవేత్త ఒకరు పోలీసులకు చిక్కాడు. అతడి నుంచి ఏకంగా రూ.231 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ సంస్థలో పరిశోధక శాస్త్రవేత్తగా పనిచేస్తున్న వెంకట రామారావు(37)ను గతనెల 30న హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడితోపాటు వ్యాపారం నిర్వహిస్తున్న రవి శంకర్‌రావు (22) నుంచి డ్రగ్స్ తీసుకుంటుండగా రామారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 221 కిలోల యాంఫెటమైన్ అనే డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ.231 కోట్ల వరకు ఉంటుందని నార్కోటిక్స్ పోలీసులు తెలిపారు. బెంగళూరులో రామారావు ఇంటిని తనిఖీ చేయగా అతడి భార్య ప్రీతి(35) దాచి ఉంచిన మరో 30 కిలోల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.1.23 కోట్ల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ డ్రగ్‌ను ప్రాసెస్ చేస్తున్న ఓ ల్యాబ్ నుంచి మరో పది కిలోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం రాకెట్‌లో మరికొంత మంది పాత్ర ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. మానసిక వైద్య చికిత్సలో ఉపయోగించే యాంఫెటమైన్‌ను ఇటీవలి కాలంలో యువత డ్రగ్స్‌లా ఉపయోగిస్తూ మత్తులో జోగుతున్నట్టు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు తెలిపారు. ఈ డ్రగ్ భారత్ నుంచి ఎక్కువగా ఆగ్నేయ ఆసియా, ఆఫ్రికా దేశాలకు అక్రమ రవాణా జరుగుతోందని పేర్కొన్నారు. హైదరాబాద్, బెంగళూరు కేంద్రాలుగా భారీ డ్రగ్ రాకెట్ నడుస్తున్నట్టు వివరించారు.