: సుప్రీం ఆదేశాలకు తలొగ్గిన కర్ణాటక.. తమిళనాడుకు నీళ్లిచ్చేందుకు అంగీకారం


అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో కర్ణాటక ప్రభుత్వం దిగి వచ్చింది. తమిళనాడుకు నీళ్లు వదిలేందుకు అంగీకరించింది. పొరుగురాష్ట్రం సాగునీటి అవసరాలకు కావేరీ జలాలను విడుదల చేయాలని శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. అయితే తీర్మానంలో ఎక్కడా తమిళనాడు అన్న పదం కనపడకపోవడం గమనార్హం. సుప్రీం కోర్టు డెడ్‌లైన్‌ను దృష్టిలో పెట్టుకుని కావేరీ జలాల విడుదలకు తలొంచిన ప్రభుత్వం వ్యూహాత్మకమైన అడుగులు వేసి తీర్మానం చేసింది. కాగా కావేరీ జలాలను పూర్తిగా తాగునీటి అవసరాలకే వినియోగించుకోవాలని సెప్టెంబరు 23న శాసనసభలో కర్ణాటక ప్రభుత్వం ఆమోదించింది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తీర్మానాలను పక్కన పెట్టి తమిళనాడుకు నీరివ్వాల్సిందేనని తీర్పు చెప్పింది. తాజాగా సోమవారం మరోమారు జరిగిన విచారణలో అత్యున్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. ‘చట్టం కొరడా ఝుళిపిస్తే ఏమవుతుందో తెలుసా?’ అంటూ కర్ణాటక ప్రభుత్వాన్ని హెచ్చరించింది. దీంతో అత్యవసరంగా సమావేశమైన శాసనసభ గత తీర్మానానికి కొన్ని సవరణలు చేసి ఆమోదించింది. ‘‘కావేరీ ఆయకట్టు పరిధిలోని రైతుల సాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించాం’’ అని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానంలో తమిళనాడు అన్న పదాన్ని వ్యూహాత్మకంగానే చేర్చలేదని తెలుస్తోంది. కావేరీ ఆయకట్టు అంటే ఇటు తమ రాష్ట్రంతోపాటు తమిళనాడు కూడా వర్తిస్తుంది. ఫలితంగా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవడంతోపాటు సొంత రాష్ట్ర రైతులను కూడా సంతృప్తి పరిచినట్టు అవుతుందనే ఉద్దేశంతోనే తమిళనాడు అన్న పదాన్ని చేర్చలేదని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News