: జయలలిత ఆరోగ్యంపై ప్రసారమవుతున్న వార్తలతో ఓ వ్యక్తి మృతి
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై మీడియాలో ప్రసారమవుతున్న వార్తలతో కలత చెందిన ఓ వ్యక్తి గుండెపోటుకు గురై మృతి చెందిన ఘటన కోయంబత్తూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... కోయంబత్తూరులోని విమానాశ్రయం సమీపంలో ముత్తుస్వామి (47) అనే ఏఐఏడీఎంకే కార్యకర్త నివసిస్తున్నాడు. ఆయనకు జయలలిత అంటే అంతులేని అభిమానం. సెప్టెంబరు 22న అనారోగ్య కారణాలతో జయలలిత ఆసుపత్రిలో చేరిన తరువాత, ముత్తుస్వామి ఇంట్లోను, స్నేహితుల వద్ద రోజూ ఇదే విషయాన్ని చర్చిస్తూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యేవాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. వారంతా ఆమె క్షేమంగా ఉంటారని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని భరోసా ఇచ్చేవారు. గవర్నర్ రావడం, పలువురు కేబినెట్ మంత్రులు జయలలితను పరామర్శించేందుకు వెళ్లడం, ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పుకార్లు పెరిగిపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన ముత్తుస్వామి ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వేగంగా స్పందించి, అతనిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. అప్పటికే ముత్తుస్వామి మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.