: గాంధీజీతో కలిసే నడిచే అనుభూతి పొందాలంటే ఆ మ్యూజియంకు వెళ్లాల్సిందే!
జాతిపిత మహాత్మా గాంధీతో కలిసి నడిచిన అనుభూతిని సొంతం చేసుకోవాలనుకునే వారు రాష్ట్రపతి భవన్ లో నిన్న ప్రారంభించిన నూతన మ్యూజియంకు వెళ్లాల్సిందే. గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించిన ఈ మ్యూజియంలో వర్చువల్ రియాలిటీ ద్వారా గాంధీజీతో కలిసి నడిచే సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి త్రీ డీ థియేటర్ లో అమర్చిన వీఆర్ ఏరియాలో ప్రదర్శించే గాంధీజీ షార్ట్ ఫిల్మ్ లో ఆయనతో కలిసి నడిచే అనుభూతిని సందర్శకులు పొందే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించినట్లు కార్యాలయ మీడియా ప్రతినిధి వేణు రాజ్ మొని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య మ్యూజియాన్ని సందర్శించవచ్చని, రూ.50 రుసుంగా తీసుకుంటున్నామని చెప్పారు. కాగా, 1950 నుంచి పరిపాలన చేసిన భారత రాష్ట్రపతుల జీవిత విశేషాలు, రాష్ట్రపతి భవన్ ప్రత్యేకతలతో పాటు ఆధునిక భారతదేశ చరిత్రను చిత్ర ప్రదర్శన, శిల్పాలు, ఆడియో,వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా, మాజీ రాష్ట్రపతులు ఉపయోగించిన వస్తువులు, విదేశీ ప్రతినిధులు అందజేసిన కానుకలను కూడా సందర్శించవచ్చు.