: మౌనాన్ని పాక్ తప్పుగా అర్థం చేసుకుంటోంది...యుద్ధమే శరణ్యం: సుబ్రహ్మణ్యస్వామి
పాకిస్థాన్ కు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని, యుద్ధం తప్ప మరో దారి లేనట్లు కనిపిస్తోందని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, 'యుద్ధం కన్నా మరో దారి కనిపించడం లేదు, భారతదేశ మౌనాన్ని పాకిస్థాన్ తప్పుగా అర్థం చేసుకుంటోంది, వారికి గుణపాఠం చెప్పల్సిన అవసరముంది' అన్నారు. యూపీఏ పాలనలో వృద్ధి చెందిన స్లీపర్ సెల్స్ ఇప్పుడు దాడులకు తెగబడుతున్నాయని ఆయన ఆరోపించారు. కొందరు ఉగ్రవాదులకు భారత్ లో ఆధార్ కార్డులు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. బారాముల్లా వంటి దాడులకు యూపీఏ వైఫల్యాలే కారణమని ఆయన ఆరోపించారు. పాకిస్థాన్ తో మనం ఘర్షణ పడుతున్నామని స్పష్టంగా గుర్తించాలని ఆయన బాలీవుడ్ నటుడు సల్మాన్ కు సూచించారు. అయితే ఇది బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తోందని, పాకిస్థాన్ తో నేరుగా యుద్ధానికి దిగితే కలర్ ఫుల్ గా కనిపిస్తుందని ఆయన చెప్పారు. అదే సమయంలో పాక్ నుంచి ఎవరినీ రానివ్వకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.