: ఏం జరుగుతోంది... ఎల్ఓసీ వద్ద పెరిగిన పాక్ ఆర్మీ ఉన్నతాధికారుల కదలికలు!
లైన్ ఆఫ్ కంట్రోట్ (నియంత్రణ రేఖ) వెంబడి పాకిస్థాన్ సైనికోన్నతాధికారుల కదలికలు పెరిగినట్టు భారత నిఘా వర్గాలు పసిగట్టాయి. పాకిస్థాన్ గస్తీ స్థావరాలన్నిటి వద్ద ఆ దేశ సైనిక బలగాలను భారీగా మోహరిస్తున్నారు. దీంతో విభజన రేఖ వద్ద పాక్ సైన్యం రెక్కీ పెరిగింది. యుద్ధంలో ముందుండే సైనికులతో ఉన్నతాధికారులు నిత్యం టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. సాధారణంగా గ్రౌండ్ లెవల్ కు సీనియర్ ఆఫీసర్లు రావడం అరుదుగా సంభవిస్తుంది. ఈ నేపథ్యంలో పాక్ సైనికాధికారులు ఎల్ఓసీ వద్ద సంచరించడానికి గల కారణాలపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. సర్జికల్ స్ట్రయిక్స్ అనంతరం లోపాలు సరిదిద్దుకోవడంలో భాగంగా ఉన్నతాధికారులు సరిహద్దులను పర్యవేక్షిస్తుండవచ్చని భారతీయ అధికారులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో పాక్ ఉన్నతాధికారులు సైన్యాన్ని స్వయంగా పరిశీలించడం వెనుక ఇతర ఉద్దేశాలు కూడా ఉండే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో పాక్ తన సైన్యాన్ని భారీ ఎత్తున మోహరించడం, దేశవ్యాప్తంగా ఉన్న సైనికుల సెలవులు రద్దు చేయడం, వంటి పరిణామాలపై ఇండియన్ ఆర్మీ నిశితంగా గమనిస్తోంది. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వారు సూచిస్తున్నారు.