: భారతీయులారా, యుద్ధం వద్దు.. మాకు మరో అవకాశమివ్వండి: ‘పాక్’ యువతి లేఖ!
జమ్మూ కాశ్మీర్ లోని యూరీ సెక్టార్ పై పాకిస్థాన్ ఉగ్రవాదుల దాడి, ఆ ఘటన అనంతరం సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు భారత్ దీటుగా సమాధానం చెప్పడం విదితమే. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్ దాడులకు దిగి ఉగ్రవాదులను మట్టుబెట్టడం తెలిసిందే. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో యుద్ధం చేయాలని కొందరు, వద్దని మరికొందరు ఎవరి అభిప్రాయాలను వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ కు చెందిన అలిజే జఫ్పర్ అనే యువతి ఒక లేఖ రాసింది. రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న సంబంధాలు బాధిస్తున్నాయని, ఇరు దేశాలు పరస్పర విమర్శలు చేసుకోవద్దని కోరింది. యుద్ధం వద్దని, శాంతియుతంగా సమస్య పరిష్కరించుకోవాలని ఆ లేఖలో సూచించింది. దాడుల కారణంగా ఈ రెండు దేశాలు ఏమి సాధించాయని ఆమె ప్రశ్నించింది. ఇరు దేశాల మధ్య ఉన్న ‘కోల్డ్ వార్’ ఇప్పుడు ‘హాట్ వార్’గా మారిందని అలిజే జప్ఫర్ ఆవేదన వ్యక్తం చేసింది. ఇండో-పాక్ సరిహద్దుల్లో తన స్నేహితులు ఎందరో ఉన్నారని, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అనారోగ్యం పాలైనప్పుడు ఆయన కోలుకోవాలని తాను దేవుడిని ప్రార్థించానని, అలాగే, రణ్ బీర్ సినిమా హిట్టయితే సంబరపడేదానినని పేర్కొంది. పాకిస్థాన్ తప్పిదాలను గుర్తించి, సర్ది చెప్పేందుకు భారతీయులు మరో అవకాశం ఇవ్వాలని ఆ లేఖలో కోరింది. కాగా, ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఈ లేఖపై నెటిజన్లు బాగానే స్పందించారు. ఆమెకు మద్దతు తెలుపుతూ పోస్ట్ లు చేస్తున్నారు.