: ముందు తమ్ముడు అఖిల్ పెళ్లి...తరువాతే నా పెళ్లి: క్లారిటీ ఇచ్చేసిన నాగచైతన్య
తన వివాహం వచ్చే ఏడాది ఉంటుందని యువ నటుడు అక్కినేని నాగచైతన్య చెప్పాడు. ప్రేమమ్ సినిమా ప్రమోషన్ లో నాగచైతన్య మాట్లాడుతూ, ముందు తన తమ్ముడు అఖిల్ వివాహం ఉంటుందని, ఆ తరువాతే తన వివాహం ఉంటుందని తెలిపాడు. సమంతను వచ్చేఏడాది వివాహం చేసుకుంటానని చెప్పాడు. తామిద్దరం 'ఏం మాయ చేశావే' నుంచే మంచి స్నేహితులమని చెప్పాడు. ఆ స్నేహాన్ని వచ్చే ఏడాది వివాహ బంధంగా మార్చుకుంటామని చెప్పాడు. వివాహం తరువాత కూడా సమంత నటిస్తుందని నాగ చైతన్య వెల్లడించాడు. కాగా, డిసెంబర్ 9న అఖిల్ నిశ్చితార్థం జరగనున్నట్టు తెలుస్తోంది.