: తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఏ రోజున స్వామిని దర్శించుకుంటే ఏం ఫలం సిద్ధిస్తుందంటే..!

అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు, తిరుమల శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగిపోయింది. నిన్న శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడు విష్వక్సేనుడు ముల్లోకాల్లో విహరించి, బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని దేవతలను ఆహ్వానించి వచ్చాడంటారు. నేడు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏ వాహన సేవలో స్వామిని దర్శించుకుంటే ఏం ఫలం సిద్ధిస్తుందో తెలుసుకుందాం. * పెద శేష వాహనంపై శ్రీవారిని దర్శించుకుంటే, సర్ప భయం పోవడంతో పాటు, కాలసర్ప దోష నివారణ కలుగుతుంది. పరమపథం సిద్ధిస్తుంది. * చిన శేష వాహనంపై స్వామిని దర్శిస్తే యోగసిద్ధి ఫలం కలుగుతుంది. * గరుడ వాహన సేవ దర్శనం వల్ల సంతాన ప్రాప్తి, దివ్యమైన జ్ఞానం కలుగుతాయి. * హంస వాహనంపై దేవదేవుని చూస్తే, విచక్షణా జ్ఞానం పెరుగుతుంది. కోపం చల్లారుతుంది. * మోహినీ అవతారంలోని స్వామిని చూస్తే, జగత్తు అంతా తాను సృష్టించిన మాయేనని స్వామి చెబుతున్నట్టు ఉంటుంది. బంధాలు, బాంధవ్యాలకన్నా విలువైనది మరేదో ఉందని స్వామి ఉద్బోధిస్తున్నట్టు తెలుస్తుంది. తనను నమ్మిన వారు ఈ మాయను సులువుగా దాటేస్తారని అభయమిస్తున్నట్టు అనిపిస్తుంది. * సింహం వాహన సేవను చూసి తరిస్తే, మృగభయం పోతుంది. * గజ వాహనంపై ఉన్న దేవుని సేవిస్తే, మహాలక్ష్మీ కటాక్షం కలగడంతో పాటు సిరి సంపదలు వర్థిల్లుతాయి. * అశ్వ వాహన సేవ నాడు దర్శించుకుంటే, మనసులోని దుర్గుణాలు పోయి సద్గుణవంతులవుతారు. * స్వర్ణరథంలో ఉభయదేవేరులతో కలసి భక్తులకు కనువిందు చేసే స్వామిని చూస్తే, పునర్జన్మ ఉండదు. * కల్పవృక్ష వాహన సేవను కనులారా దర్శిస్తే, కోరిన కోరికలన్నీ తీరుతాయి. * ఇక సూర్య ప్రభ వాహనంలో తిరిగే మలయప్ప స్వామిని వీక్షిస్తే, ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయి. * హనుమంత వాహన సేవలో పాల్గొంటే, ఏ కష్టం వచ్చినా, స్వామి కృప వెన్నంటి నడిపించి, గట్టున పడేస్తుంది.

More Telugu News