: ఓడిపోయిన పాక్ సైన్యం ఇంకేం చేస్తుంది?: బంగ్లాదేశ్ ప్రధాని హసీనా నిప్పులు
ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించుకోవాల్సిన సార్క్ దేశాల సమావేశాలు రద్దు కావడానికి పాకిస్థాన్ వైఖరే కారణమని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నిప్పులు చెరిగారు. పాకిస్థాన్ సైన్యాన్ని, ఓడిపోయిన సైన్యంగా అభివర్ణించిన ఆమె, 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో పాక్ సైన్యం చావు దెబ్బతిందని గుర్తు చేశారు. ఐరాస సమావేశాల్లో పాల్గొనేందుకు న్యూయార్క్ వెళ్లి వచ్చిన ఆమె, మీడియాతో మాట్లాడారు. యుద్ధ నేరాలు చేసిన వారికి తమ దేశం మరణశిక్షలను అమలు చేస్తుంటే, వాటిని నిరసిస్తూ, ఇస్లామాబాద్ లో ప్రదర్శనలు జరుగుతుండటంతోనే తాము సార్క్ సమావేశాలకు హాజరు కారాదని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. "పాక్ సైన్యం ఏనాడో ఓడిపోయింది. మేము వారిని 1971 యుద్ధంలో ఒడించాం. ఓడిపోయిన దళాలను కలిగివున్న పాక్, ఏం చెప్పినా మేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు" అని హసీనా అన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక బంధాలు కొనసాగుతాయని తెలిపారు. భారత్, పాక్ మధ్య ఇటీవలి కాలంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు.