: తొందరెందుకు? కాస్త వెయిట్ చేయండి.. మెరుపుదాడి సాక్ష్యాలు విడుదల చేయాలన్న పాక్ డిమాండ్‌పై రాజ్‌నాథ్ స్పందన
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో భారత్ చేశామని చెబుతున్న సర్జికల్ స్ట్రయిక్స్ అంతా బూటకమని, దమ్ముంటే సాక్ష్యాలు బయటపెట్టాలని పాక్ చేస్తున్న డిమాండ్‌పై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ‘‘తొందరెందుకు? కాస్త వెయిట్ చేయండి’’ అని బదులిచ్చారు. మెరుపు దాడుల సమయంలో చిత్రీకరించిన వీడియోలను ఆర్మీ అధికారులు ప్రభుత్వానికి ఇచ్చినట్టు సమాచారం. ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్‌నాథ్ సింగ్ వద్ద కొందరు మీడియా ప్రతినిధులు పాకిస్తాన్ లేవనెత్తుతున్న అనుమానాలపై ప్రశ్నించారు. దీనికి మంత్రి బదులిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. పాక్‌కు అంత తొందర పనికి రాదని, ‘‘జస్ట్ వెయిట్ అండ్ వాచ్’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించిన ఆర్మీకి అభినందనలు తెలిపారు. భారత్‌ను తలెత్తుకునేలా చేసిన సర్జికల్ దాడుల గురించి ఒక్క మన దేశానికే కాకుండా ప్రపంచమంతా తెలుసని ఆయన పేర్కొన్నారు. మెరుపు దాడుల సమయంలో ఆర్మీ చిత్రీకరించిన దృశ్యాలను మరో రెండుమూడు రోజుల్లో ప్రభుత్వం విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.