: సీఎం జయలలిత ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల.. లండన్ డాక్టర్ సలహాపై చికిత్స కొనసాగింపు!
తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఈ మేరకు చెన్నైలోని అపోలో ఆసుపత్రి వైద్యుల బృందం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. లండన్ కు చెందిన డాక్టరు జాన్ రిచర్డ్స్ సలహాలు తీసుకుంటున్నామని, జయలిలత ఆరోగ్యం మెరుగుపడుతోందని, యాంటీ బయోటిక్స్ తో పాటు మెరుగైన చికిత్స అందిస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మరికొన్ని రోజుల పాటు జయలలితను ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తామని ఆ హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. కాగా, కేబినెట్ మంత్రులు అపోలో ఆసుపత్రికి వెళ్లారు. ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నాడీఎంకే నేతలు తాజాగా ఒక ప్రకటన చేశారు.