: సర్జికల్ దాడులు జరగలేదంటూ పాక్ ఆర్మీ కుయత్నాలు... సరిహద్దులకు జర్నలిస్టులను తీసుకెళ్లి చూపించిన పాక్!


భారత సైన్యం తమ భూభాగంలో ఎటువంటి సర్జికల్ స్ట్రయిక్స్ జరపలేదంటూ పాకిస్తాన్ ఆర్మీ అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించే కుయత్నాలు ప్రారంభించింది. దేశ, విదేశీ మీడియాకు చెందిన జర్నలిస్టులను నిన్న నియంత్రణ రేఖ వద్దకు తీసుకెళ్లింది. 'చూడండి, ఇక్కడ సర్జికల్ స్ట్రయిక్స్ జరిగాయనేందుకు ఎటువంటి ఛాయలు కనిపించడం లేదు కదా' అంటూ వారిని మాయబుచ్చే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్, అంతర్జాతీయ మీడియా ఈ పర్యటన విశేషాలను ఈ రోజు ప్రచురించాయి. అంతర్జాతీయ మీడియా ప్రతినిధులను పాక్ ఆర్మీ విమానంలో సరిహద్దులకు తీసుకెళ్లడం అన్నది చాలా అరుదైన చర్యగా ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్ పేర్కొంది. సర్జికల్ దాడులు జరిగాయనేందుకు ఎటువంటి ఆధారాలు లేవని, భారత్ చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలుగా పాకిస్తాన్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ ఆసిమ్ బజ్వా మీడియా ప్రతినిధులతో అన్నట్టు డాన్ పత్రిక పేర్కొంది. మొత్తం 20 మీడియా సంస్థలకు చెందిన 40 మంది జర్నలిస్టులను పాకిస్తాన్ ఆర్మీ సరిహద్దులకు తీసుకెళ్లి చూపించింది. ‘భారత సైనిక దళాల కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ సున్నితమైన అంశాలపై ప్రకటనలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాలి. మావైపు అటువంటిది ఏమీ చోటు చేసుకోలేదు. భవిష్యత్తులోనూ అందుకు తావివ్వం. మీరు వెళ్లి సాధారణ పౌరులను కలవచ్చు. ఐక్యరాజ్యసమితి బృందానికి, మీడియా, సాధారణ పౌరులకు మావైపు మార్గాలు తెరిచే ఉంచుతాం. వెళ్లి పరిశీలించుకోవచ్చు’ అని బజ్వా అన్నట్టు ఏఎఫ్ పీ వార్తా సంస్థ తెలిపింది. అయితే, ఈ విషయంలో స్థానికులతో మాట్లాడిన ఏఎఫ్ పీ వార్తా సంస్థ ప్రతినిధి వారి మాటలు నమ్మశక్యంగా లేవని కూడా పేర్కొనడం గమనార్హం.

  • Loading...

More Telugu News