: ఎంఎస్ ధోనీ సినిమాకు జోరుగా కలెక్షన్లు... రెండ్రోజుల్లో రూ.42కోట్లు
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా సుషాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన 'ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ' సినిమా కలెక్షన్లు జోరుమీదున్నాయి. మొదటి రెండు రోజుల్లో సుమారు రూ.41.9 కోట్లు వసూలు అయినట్టు నిర్మాతలు ప్రకటించారు. మొదటి రోజు రూ.21.3 కోట్లు వసూలు కాగా, రెండో రోజు హిందీ, తమిళ్, తెలుగు వర్షన్లలో మొత్తం రూ.20.6 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఒక్క హిందీ వెర్షన్ కే రూ.18.75 కోట్ల ఆదాయం వచ్చింది. రెండు రోజుల్లో కలుపుకుంటే హిందీ, తమిళ్, తెలుగు వెర్షన్లలో మొత్తం బాక్సాఫీసు కలెక్షన్లు రూ.41.9 కోట్లుగా ఉన్నాయి. ఇందులో హిందీ విభాగం నుంచి రూ.38.75 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొదటి రోజుతో పోల్చుకుంటే రెండో రోజైన శనివారం కలెక్షన్లు స్వల్పంగా తగ్గాయి. అయితే, ఆదివారం సెలవు కావడంతో కలెక్షన్లు పెరుగుతాయని భావిస్తున్నారు.