: సుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తే వివాహ బంధం విచ్ఛిన్నమైనట్లే.. వారికి విడాకులు మంజూరు చేయాల్సిందే: హైకోర్టు
మనస్పర్థల కారణంగా భార్యాభర్తలు సుదీర్ఘకాలంపాటు విడివిడిగా జీవిస్తే వారి వివాహ బంధం విచ్ఛిన్నమైనట్లేనని హైకోర్టు అభిప్రాయపడింది. అటువంటి వారు విడాకుల కోసం కోర్టును ఆశ్రయిస్తే వారికి తప్పకుండా విడాకులు మంజూరు చేయాల్సిందేనని ఆదేశించింది. నిజామాబాద్‌కు చెందిన బహ్మానందం 1982లో రమాదేవిని వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె పుట్టిన తర్వాత 1995లో భర్తకు చెప్పకుండానే రమాదేవి పుట్టింటికి వెళ్లిపోయారు. ఎన్నేళ్లు వేచి చూసినా ఆమె అక్కడి నుంచి తిరిగిరాకపోవడంతో బ్రహ్మానందం విడాకుల కోసం కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసును విచారించిన న్యాయస్థానం వివాహాన్ని రద్దు చేసేందుకు నిరాకరించింది. దీంతో బ్రహ్మానందం హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి, జస్టిస్ శ్యాంప్రసాద్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఈ కేసును విచారించింది. 1995లో భర్తను విడిచి వెళ్లిన భార్య అందుకు తగిన కారణాలు చెప్పలేదని, కాపురానికి తిరిగి రాలేదని కోర్టు పేర్కొంది. సుదీర్ఘ కాలంపాటు వేర్వేరుగా ఉన్న దంపతులు కలిసి ఉండే అవకాశం లేనప్పుడు సుప్రీం కోర్టు తీర్పును దృష్టిలో పెట్టుకుని విడాకులు మంజూరు చేయాల్సిందేనని తేల్చి చెబుతూ పిటిషనర్‌కు విడాకులు మంజూరు చేసింది.