: నయీం పేరుతో ఎమ్మెల్యే దందా.. సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేసిన బాధితులు!


పోలీస్ ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ నయీం మృతి చెందినా ఆయన పేరుతో ఆగడాలు మాత్రం ఆగడం లేదు. నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు నయీం పేరుతో తమను బెదిరిస్తున్నారంటూ కొందరు బాధితులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. నయీం ప్రధాన అనుచరుడిగా భావిస్తున్న శేషన్న, నయీం బంధువు ఖలీంలను అడ్డం పెట్టుకుని ఆయన తమను బెదిరిస్తున్నట్టు ఫిర్యాదు చేశారు. తన నియోజకవర్గంతోపాటు చుట్టుపక్కల భూ లావాదేవీల్లోనూ ఆయన జోక్యం చేసుకుంటున్నట్టు వారు వాపోయారు. ప్రస్తుతం శేషన్న, ఖలీంలు అజ్ఞాతంలో ఉన్నారు. వారి కోసం సిట్ గాలిస్తోంది. వారు కనుక దొరికితే ఆ ఎమ్మెల్యే బండారం బయటపడుతుందని చెబుతున్నారు. ఎమ్మెల్యేపై ఫిర్యాదులు అందడంతో నిజానిజాలను నిగ్గుతేల్చి నివేదిక ఇవ్వాల్సిందిగా సీఎం సిట్ అధికారులను ఆదేశించినట్టు సమాచారం. ఈ విషయంలో ఇప్పటికే విచారణ ప్రారంభమైందని, క్షేత్ర స్థాయి విచారణ జరపాల్సిందిగా నల్గొండ ఎస్పీకి సిట్ సూచించినట్టు తెలిసింది. ఎస్పీ ఆదేశాలతో సంస్థాన్ నారాయణ్‌పూర్ ఎస్సై విచారణ ప్రారంభించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News