: తెలంగాణ ఉద్యోగుల గుండెలను పిండేసిన 'కాటమరాజు' లేఖ.. కన్నీటి పర్యంతమవుతున్న ఉద్యోగులు
తెలంగాణ సచివాలయంలోని పలు చోట్ల కాటమరాజు పేరుతో అతికించిన లేఖ తెలంగాణ ఉద్యోగుల గుండెలను పిండేస్తోంది. ఆ లేఖను చదివిన వారి కళ్ల నుంచి కన్నీటి బొట్లు రాలిపడుతున్నాయి. అజ్ఞాత వ్యక్తి రాసిన ఈ లేఖ ఇప్పుడు రెండు రాష్ట్రాల ఉద్యోగులను కదిలిస్తోంది. ‘కళ్లే కాదు... గుండె కారుస్తోంది నీరు’ పేరుతో రాసిన ఈ లేఖలో ఏం రాశారంటే.. అనంత కాల ప్రవాహంలో చరిత్రలో ఎన్నో మలుపులు. ఆ మలుపులు కొంతమందికి సంతోషాన్ని, మరికొంతమందికి బాధను కలగజేస్తాయి. ఇంకొంతమందికి రెండింటినీ కలుగజేస్తాయి. ఈ మలుపు మనసుని మెలిపెడుతోంది. కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడి గాలి పీల్చాం. ఇక్కడి నీళ్లు తాగాం. ఇక్కడి ప్రజలతో కలిసిపోయి పరిచయాల్ని, స్నేహాల్ని పెంచుకుని, కొంతమందితో ఏకంగా బంధాల్ని, బంధుత్వాలని పెంచుకుని నడయాడిన నేలను వీడుతున్న వేళ.. కళ్లే కాదు గుండె నీరు కారుస్తుండగా సెలవు అడుగుతున్నాం. ఏ బంధమూ ఒక్క జన్మలో బలపడదు. అది అనేక జన్మల సంబంధాన్ని కలిగి ఉంటుంది. భగవద్గీత కూడా కర్మలు.. తరువాత జన్మలకు బదిలీ అవుతాయని చెబుతున్నది. మిమ్మల్నందిరినీ కొత్త సచివాలయానికి ఆహ్వానిస్తూ.. జ్ఞాపకాలతో మీ కాటమరాజు అని రాసి ఉంది. ఈ కాటమరాజు ఎవరో తెలియదు కానీ ఈ లేఖ మాత్రం ఇప్పుడు తెలంగాణ ఉద్యోగుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.