: మా కుటుంబ సభ్యుల్ని చంపింది నయీం అయినా, చంపించింది మాత్రం చంద్రబాబు ప్రభుత్వమే!: బెల్లి కృష్ణ


బెల్లి లలిత కుటుంబాన్ని అత్యంత పాశవికంగా హత్య చేసింది గ్యాంగ్ స్టర్ నయీం అయినప్పటికీ, హత్య చేయించింది మాత్రం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్రభుత్వమేనని 18 ఏళ్ల అజ్ఞాతం వీడిన బెల్లి కృష్ణ ఆరోపణలు చేశారు. ఓ టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం కోసం పని చేస్తున్నామన్న కసితో, తెలంగాణ రావడం ఇష్టం లేని చంద్రబాబు ప్రభుత్వం తన కుటుంబాన్ని హతమార్చేలా నయీంను పురిగొల్పిందని ఆరోపించారు. ఉద్యమం, ఆట, పాటలతో తెలంగాణ ప్రజల్లో తన చెల్లెలు బెల్లి లలిత చైతన్యం నింపుతోందని ఆగ్రహించిన చంద్రబాబు.. నయీంతో ఆమెను బెదిరింపులకు గురిచేశాడని ఆయన చెప్పారు. వాస్తవానికి నయీంకు, తమకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని, ఇంకా తాము స్నేహితులమని అన్నారు. అయితే నయీం జైలులో ఉండగా ప్రభుత్వం అతనికి ఏం చేయాలో చెప్పేదని ఆయన అన్నారు. ప్రభుత్వం సహకరించడం వల్లే నయీం తమ కుటుంబాన్ని అంతమొందించాడని ఆయన పేర్కొన్నారు. తన చెల్లెలు పౌరహక్కుల నేత కావడం వల్లే చంపారన్నది పచ్చి అబద్ధమని ఆయన తెలిపారు. తన సాయంతో తన చెల్లెలు తెలంగాణ ఉద్యమంతోపాటు, వ్యభిచార వ్యతిరేక ఉద్యమం, సారా వ్యతిరేక, గుట్కా వ్యతిరేక ఉద్యమాలు చేసిందని ఆయన తెలిపారు. ఇవన్నీ నచ్చని ప్రభుత్వం తన కుటుంబాన్ని హతమార్చిందని ఆయన చెప్పారు. నయీంపై తనకు ఇప్పటికీ కోపం లేదని ఆయన తెలిపారు. నయీం అప్పటి ప్రభుత్వం చేతిలో కత్తి లేదా తుపాకీ అయ్యాడని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News