: యూరీ దాడిలో 177 మంది సైనికులు చనిపోయారు.. భారత్ వాస్తవం దాస్తోంది!: హఫీజ్ సయీద్
భారత్ లోపలికి వెళ్లేందుకు పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తమకు అనుమతి ఇవ్వాలని ఉగ్రవాది హఫీజ్ సయీద్ డిమాండ్ చేశాడు. ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన అనంతరం పాక్ లోని ఫైజలాబాద్ లో మద్దతుదారులతో బహిరంగ సభ నిర్వహించిన ఆయన మాట్లాడుతూ, యూరీ సెక్టార్ పై కశ్మీరీ ముజాహిద్దీన్ నిర్వహించిన దాడిలో 177 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారని, ఈ విషయాన్ని భారత సైన్యం ఎందుకు దాస్తోందో తనకు తెలియడం లేదని అన్నాడు. భారత మీడియా ప్రచారం చేస్తున్న సర్జికల్ స్ట్రయిక్స్ వట్టి బూటకమని చెప్పాడు. భారత్ పై పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకుంటే ఎలా ఉంటుందో త్వరలోనే చూస్తారని హఫీజ్ హెచ్చరించాడు. పాకిస్థాన్ ను అమెరికా కూడా అడ్డుకోలేదని ఈ కరుడు గట్టిన తీవ్రవాది తేల్చిచెప్పాడు. అసలు సర్జికల్ స్ట్రయిక్స్ కు సరైన అర్థం పాకిస్థాన్ సైనికులు చెబుతారని, నవాజ్ షరీఫ్ అనుమతులు మంజూరు చేయాలని సూచించాడు. కశ్మీరీలను ఇండియన్ ఆర్మీ చంపినప్పుడు అమెరికా సహా ప్రపంచం మొత్తం మౌనంగా ఉందని, యూరీ దాడిలో కాశ్మీర్ ముజాహీద్దీన్ లు భారత సైనికులను హతమార్చినప్పుడు మాత్రం అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని హఫీజ్ మండిపడ్డాడు. యూరీ ఘటనలో 177 మంది మరణిస్తే... భారత్ కేవలం 19 మంది మాత్రమే మరణించారని అబద్ధాలు చెప్పిందని ఎద్దేవా చేశాడు.