: అమెరికా, దక్షిణ కొరియా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న చైనా
అమెరికాకు చెందిన అత్యాధునిక క్షిపణీ నిరోధక వ్యవస్థను దక్షిణ కొరియా భూభాగంపై మోహరించడంతో చైనాలో కంగారు మొదలైంది. దీంతో అమెరికా, దక్షిణ కొరియాలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరిక జారీ చేసింది. ఉత్తరకొరియా ఈ ఏడాది జనవరిలో అణు పరీక్షలు నిర్వహించడంతో కొరియా భూభాగంలో ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఉత్తర కొరియా వరుసబెట్టి క్షిపణుల ప్రయోగాల ద్వారా దక్షిణ కొరియాకు, అమెరికాకు కొరకరాని కొయ్యలా తయారైంది. దీంతో తమ స్వీయ రక్షణ కోసం దక్షిణ కొరియా అమెరికాకు చెందిన యూఎస్ టెర్మినల్ హై ఆల్టీట్యూడ్ ఏరియా డిఫెన్స్ (తాడ్) క్షిపణీ నిరోధక వ్యవస్థను తన భూభాగంలో ఏర్పాటు చేసేందుకు ఈ ఏడాది జూలైలో అంగీకరించింది. దీని ద్వారా ఉత్తరకొరియా అణు క్షిపణుల నుంచి రక్షించుకోవచ్చన్నది దక్షిణ కొరియా యోచన. ఈ క్షిపణీ నిరోధక వ్యవస్థను గోల్ఫ్ కోర్స్ లో మోహరించనున్నట్టు దక్షిణ కొరియా శుక్రవారం ప్రకటించింది. దీంతో చైనా అధికారిక కమ్యూనిస్టు పార్టీ పత్రిక పీపుల్స్ డైలీ అమెరికా క్షిపణీ నిరోధక వ్యవస్థకు వ్యతిరేకంగా కథనం ప్రచురించింది. తమ దేశ భద్రతా ప్రయోజనాలకు భంగం వాటిల్లితే మిగిలిన దేశాల మాదిరిగా చూస్తూ ఊరుకోబోమని అందులో పేర్కొంది. కొరియా ప్రాంతంలో ముప్పుకు చోటు లేదని, అమెరికా, దక్షిణ కొరియా ఈ ప్రాంత భద్రతా ప్రయోజనాలకు, ముఖ్యంగా చైనా ప్రయోజనాలకు భంగం కలిగిస్తే అవి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆ కథనం పేర్కొంది.