: విద్యుత్ తో నడిచే పవర్ బైక్... ధర రూ.1.24 లక్షలు
బైక్ లు ఏవైనా పెట్రోల్ తో నడిచేవే ఉంటాయి. అయితే, పుణే నగరానికి చెందిన టార్క్ మోటార్స్ మాత్రం దేశీయంగా తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ టీ6ఎక్స్ మోడల్ ను ఆవిష్కరించింది. విద్యుత్ తో నడిచే స్కూటర్లను చాలా కంపెనీలు తయారు చేసి ఎప్పటి నుంచో విక్రయిస్తున్నాయి. అయితే, ఇవేవీ కూడా కస్టమర్ల సంతృప్తిని చూరగొనలేకపోయాయి. కారణం వీటిలో సదుపాయాలు అంతగా లేకపోవడమే. కానీ టార్క్ మోటార్స్ అలాంటి ప్రతికూలతలను అధిగమిస్తూ బైక్ ను తీసుకొచ్చింది. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీలను వినియోగించారు. 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని కంపెనీ ప్రకటించింది. ఒక్కసారి చార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని తెలిపింది. కేవలం గంట సమయంలోనే బ్యాటరీ 80 శాతం చార్జ్ అవుతుందని, మొత్తం చార్జ్ పూర్తి కావడానికి రెండు గంటలు చాలని పేర్కొంది. వినియోగాన్ని బట్టి బ్యాటరీ 80వేల కిలోమీటర్ల నుంచి లక్ష కిలోమీటర్లు వరకు మన్నికగా ఉంటుందని కూడా ప్రకటించింది. దీని ధర రూ.1.24 లక్షలు. బైక్ చూడ్డానికి స్పోర్టీ లుక్ తో యువతను ఆకట్టుకునేలా కంపెనీ రూపొందించింది. ముందుగా బెంగళూరు, పుణే, ఢిల్లీలో దీన్ని విక్రయిస్తామని, తర్వాత మిగిలిన నగరాల్లోకి అందుబాటులోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది. ఈ బైక్ లో డిజిటల్ డిస్ ప్లే, ఏబీఎస్, సీడీఎస్, యాంటీ తెఫ్ట్ వంటి భద్రతా సదుపాయలు సైతం ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒక్కసారి చార్జ్ చేస్తే సగటున 60 కిలోమీటర్ల వరకే ప్రయాణించే అవకాశం, వేగం 40 కిలోమీటర్లు, చార్జింగ్ కు 8 గంటల సమయం వంటి ప్రతికూలతలు ఉన్నాయి.