: నా పదవి జిల్లా ఏర్పాటుకు అడ్డంకి కాకూడదు.. నా రాజీనామాను ఆమోదించండి: డీకే అరుణ
తెలంగాణ సర్కారు చేస్తోన్న కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాలను జిల్లాగా చేయాలని ఏడాది కాలంగా ఎన్నోసార్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌కి వినతిపత్రాలు ఇచ్చామని కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ అన్నారు. ఈరోజు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే, తన రాజీనామా లేఖను ముందుగా శాసనసభ స్పీకర్ మధుసూదనాచారికి కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ కి పంపించినట్లు తెలిపారు. గద్వాలను జిల్లాగా ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించి ఆ తరువాత ఆ లేఖను స్పీకర్ కు పంపాలని ఆమె వ్యాఖ్యానించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజల అభ్యంతరాలు, సలహాలు పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటిస్తోందని, కానీ మరి తమ వినతులని ఎందుకు పట్టించుకోవడం లేదని డీకే అరుణ ప్రశ్నించారు. గద్వాల జిల్లా కోసం శాంతియుతంగా నిరసనలు, నిరాహార దీక్షలు, రాస్తారోకోలు జరిగాయని ఆమె అన్నారు. అక్కడి ప్రాంతవాసుల కోరికను కేసీఆర్‌కు ఎన్నో రూపాలుగా తెలిపినట్లు ఆమె పేర్కొన్నారు. అయినా ప్రభుత్వం తమ ఆకాంక్షను నెరవేర్చడం లేదని అన్నారు. ప్రజలు ఆన్ లైన్ లో ఆ ప్రాంతం నుంచి 13 వేలకు పైగా వినతులు ఇచ్చారని ఆమె అన్నారు. ‘ప్రజల ఆకాంక్షను డీకే అరుణపై ఉన్న కోపంతో అణచివేయకుండా గద్వాలను జిల్లాగా చేయండి. నా రాజీనామాను ఆమోదించండి. లేఖలో ఉన్న సారాంశాన్ని ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలి. ఆ తరువాత స్పీకర్ కి పంపించాలి. డీకే అరుణ రాజీనామా చేస్తే జిల్లా వస్తుందని టీఆర్ఎస్ నేతలు అన్నారు. నేను ఎమ్మెల్యేగా ఉండడమే జిల్లా ఏర్పాటుకు అడ్డంగా ఉందని మీరు భావిస్తున్నారు. అందుకే నేను రాజీనామా చేస్తున్నాను. నా పదవి జిల్లా ఏర్పాటుకు అడ్డంకి కాకూడదు’ అని డీకే అరుణ వ్యాఖ్యానించారు. రాజీనామా లేఖను ఆమె మీడియా ముందు చదివి వినిపించారు.