: భారత్ కు ప్రవహించే బ్రహ్మపుత్ర ఉప నదికి చైనా అడ్డుకట్ట


పాకిస్తాన్ ఉగ్రవాదుల దొంగదెబ్బకు ప్రతీకారంగా ఆ దేశానికి బుద్ధి వచ్చేలా చేసేందుకు మోదీ సర్కారు సింధు నదీ జలాల ఒప్పందాన్ని సమీక్షించనుందంటూ వార్తలు వచ్చిన విషయం తెలుసు. ఒకవైపు పాకిస్తాన్ కు వెళ్లే నీటిని సాధ్యమైనంత వాడుకుని ఆ దేశ పాలకులకు భారత్ అంటే ఏంటో అర్థమయ్యేలా తెలియజెప్పాలని భావిస్తుంటే... మరోవైపు చైనా భారత్ లోకి ప్రవహించే నదీ జలాలకు అడ్డుకట్టలు వేసే పనిలో ఉంది. బ్రహ్మపుత్ర ఉపనదిగా పేర్కొనే గ్జియా బుకు నదిపై చైనా లాల్హో పేరుతో భారీ జలవిద్యుత్ ప్లాంట్ ను నిర్మిస్తోంది. ఇందుకోసం రూ.5వేల కోట్ల వ్యయం చేస్తోంది. ఈ వివరాల్ని జిన్హువా వార్తా సంస్థ శనివారం ప్రచురించింది. బ్రహ్మపుత్ర నది టిబెట్ ప్రాంతం నుంచి భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ లోకి ప్రవహిస్తుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ కు వెళుతుంది. లాల్హో ప్రాజెక్టును చైనా 2014లోనే చేపట్టగా 2019 నాటికి పూర్తి చేయనుంది. అయితే ఈ ప్రాజెక్టు వల్ల మనపై పడే ప్రభావంపై ఇప్పటికైతే స్పష్టత లేదు. గతేడాదే చైనా బ్రహ్మపుత్ర నదిపై రూ.10వేల కోట్లతో నిర్మించిన జామ్ జల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించింది. చైనా 12వ పంచవర్ష ప్రణాళిక మేరకు మరో మూడు జల విద్యుత్ ప్రాజెక్టులను బ్రహ్మపుత్ర నదిపై నిర్మించనుంది. ఈ ప్రాజెక్టుల గురించి చైనాకు తాము ఆందోళన తెలియజేసినట్టు కేంద్ర మంత్రి సన్వర్ లాల్ జాట్ ఇటీవల తెలిపారు.

  • Loading...

More Telugu News