: వచ్చే ఏడాదే మా పెళ్లి.. తేల్చేసిన నాగచైతన్య
ప్రేమ వార్తలకు ఇప్పటికే పుల్‌స్టాప్ పెట్టిన నాగచైతన్య తాజాగా పెళ్లి విషయంలోనూ క్లారిటీ ఇచ్చాడు. వచ్చే ఏడాదే తను, సమంత పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిపాడు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగచైతన్య సమంతతో తన లవ్ గురించి చెప్పుకొచ్చాడు. తాము ప్రేమలో ఉన్న విషయం కుటుంబ సభ్యులందరికీ తెలుసని పేర్కొన్నాడు. వృత్తిపరంగా ఆర్భాటాలు తప్పవని కానీ వ్యక్తిగతంగా తనకు, సమంతకు అవి నచ్చవని చెప్పాడు. వచ్చే ఏడాది బంధుమిత్రుల సమక్షంలో టేస్ట్‌ఫుల్‌గా పెళ్లి చేసుకుంటామని వివరించాడు. ‘ఏమాయ చేసావే’ సినిమా చేస్తున్పటి నుంచే సమంతతో పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత తమకు తెలియకుండానే ‘బెస్ట్ ఫ్రెండ్స్’గా మారిపోయామని తెలిపాడు. తమది ఏ ఒక్కరోజులోనో పుట్టిన ప్రేమ కాదని పేర్కొన్న చైతూ ఇప్పటి వరకు ఒకరికొకరం ప్రపోజ్ చేసుకోలేదని పేర్కొన్నాడు. తనకు 30 ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందని, అప్పుడు సమంత తప్ప మరే అమ్మాయి గుర్తుకు రాలేదన్నాడు. ఈ ఏడాదిలోనే తాను సమంత వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చినట్టు చైతూ పేర్కొన్నాడు. ఓరోజు సమంత వద్దకు వెళ్లి ‘‘ఎన్ని రోజులు ఇలా బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్‌గా ఉంటాం. పెళ్లి చేసుకుందాం. నాకు నువ్వు కరెక్ట్ అనిపిస్తోంది’’ అని చెప్పానని తెలిపాడు. పెళ్లి వద్దనుకుంటే మాత్రం ఇక్కడితో ఆపేద్దామని అన్నట్టు వివరించాడు. అప్పుడే తన ఇష్టాన్ని సమంత వ్యక్తం చేసిందని, ఆ క్షణమే తాము పెళ్లితో ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నామని నాగచైతన్య వివరించాడు.