: తిరుమల తిరుపతికి అంత ఖ్యాతి ఎందుకు వచ్చిందో తెలుసా?.. స్వచ్ఛ సదస్సులో చెప్పిన మోదీ


ఎంత గొప్ప దేవుడు కొలువైనా ఆలయాల్లో శుభ్రత లేకుంటే ఆధ్యాత్మిక భావన కలగదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టి రెండేళ్లు కావస్తున్న సందర్భంగా శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జాతీయ స్వచ్ఛతా సదస్సు ‘ఇండోశాన్’ను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశుభ్రతకు తిరుమల మారుపేరని అన్నారు. ‘‘ఓసారి తిరుపతి వెళ్లి చూడండి. దారులు ఎంతో అందంగా ఉంటాయి. ఆహ్లాదకర వాతావరణం, పరిశుభ్రత మనసును దోచుకుంటాయి’’ అన్నారు. తిరుమల, వైష్ణోదేవి ఆలయాలకు అంతటి పేరు ప్రఖ్యాతులు రావడానికి పరిశుభ్రతే కారణమన్నారు. పురాతన కాలం నుంచే స్వచ్ఛత మన ఆధ్యాత్మికతలో చేరిందని పేర్కొన్న మోదీ పరిశుభ్రతకు విలువనిచ్చారు కాబట్టే వాటికి అంతటి ఖ్యాతి లభిస్తోందన్నారు. అన్ని ప్రార్థనా మందిరాలకు చుట్టూ ఒకటి రెండు కిలోమీటర్లు పరిశుభ్రంగా తయారుచేయాలని సూచించారు. భక్తులకు ప్రసాదంతోపాటు శుభ్రతకు సంబంధించిన పత్రాలను కూడా పంపిణీ చేయాలని కోరారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మాగాంధీ సత్యాగ్రహాన్ని ప్రారంభించినట్టు మనం పరిశుభ్ర భారత్ కోసం స్వచ్ఛాగ్రహానికి నడుంబిగించాలని మోదీ పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News