: బాగ్దాద్ డాక్టర్‌నంటూ నగర యువతికి మోసగాడి వల.. రూ.34.5 లక్షలు సమర్పించుకున్న బాధితురాలు


పెళ్లి కోసం మాట్రిమోనియల్‌ను ఆశ్రయించిన ఓ యువతి ఘరానా మోసగాడి చేతిలో చిక్కి విలవిల్లాడుతోంది. ముక్కుమొహం తెలియని వ్యక్తికి లక్షలాది రూపాయలు సమర్పించుకున్నాక గానీ తాను మోసపోయానని ఆమె గుర్తించలేకపోయింది. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లాకు చెందిన యువతి హైదరాబాద్‌లోని బేగంపేటలో ఓ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. ఈ ఏడాది మొదట్లో ఆమె పెళ్లి కోసం ఓ మాట్రిమోనియల్ సైట్‌లో తన పేరు, వివరాలను రిజిస్టర్ చేసుకుంది. ఆమె ప్రొఫైల్‌ను చూసిన ఓ వ్యక్తి యువతికి ఫోన్ చేసి తాను బాగ్దాద్‌లో వైద్యుడినని చెప్పి పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య చాటింగ్‌లు కొనసాగాయి. యువతి పూర్తిగా తన అధీనంలోకి వచ్చిందని నమ్మిన తర్వాత మోసగాడు తన అసలు ప్రణాళికను అమలు చేశాడు. తాను బాగ్దాద్ నుంచి హైదరాబాద్ వచ్చిన వెంటనే హైదరాబాద్‌లో పెద్ద ఆస్పత్రి నిర్మిస్తానని చెప్పుకొచ్చాడు. నిధుల కొరత కూడా లేదని, అందుకు కావాల్సిన డబ్బులు తన ఉన్నాయని చెప్పుకొచ్చాడు. అయితే తాను రావడానికి ముందే తన దగ్దర ఉన్న డబ్బును వజ్రాలు, బంగారం రూపంలోకి మార్చి ఎయిర్ కార్గోలో పంపిస్తానని, జాగ్రత్తగా భద్రపరచాలని సూచించాడు. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చిలో కస్టమ్స్ అధికారుల పేటి బాధిత యువతికి ముంబై నుంచి ఓ ఫోన్‌కాల్ వచ్చింది. బాగ్దాద్ నుంచి భారీ పార్శిల్ వచ్చిందని, దానిని క్లియర్ చేయాలంటే పన్ను రూపంలో కొంత చెల్లించాల్సి ఉంటుందని పేర్కొనడంతో వారు చెప్పిన అకౌంట్‌లో యువతి డబ్బులు జమచేసింది. తర్వాత పలుమార్లు ఫోన్లు వచ్చాయి. మాయగాడి ఉచ్చులో పూర్తిగా చిక్కుకున్న యువతి మొత్తంగా పది బ్యాంకు అకౌంట్లలో ఏకంగా రూ.34.5 లక్షలు డిపాజిట్ చేసి చేతులు కాల్చుకుంది. తర్వాత తాను మోసపోయానని గ్రహించి సీసీఎస్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె నగదు డిపాజిట్ చేసిన అకౌంట్లు గుజరాత్, ఢిల్లీతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందినవిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News