: భారత్ మెరుపుదాడులకు మచిలీపట్నం నుంచి అందిన సాయం.. నైట్ విజన్ పరికరాలు ఇక్కడివే!
సర్జికల్ స్ట్రయిక్స్.. పాకిస్థాన్‌ను హడలుగొట్టడమే కాదు, ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన ఈ దాడులను భారత జవాన్లు అత్యంత చాకచక్యంతో నిర్వహించి ‘పని’ పూర్తిచేసిన విషయం తెలిసిందే. చిమ్మచీకట్లో సైతం నియంత్రణ రేఖకు ఆవల ఉన్న ఉగ్రశిబిరాలను ధ్వంసం చేసి సత్తా చాటారు. ఆర్మీ విజయవంతంగా నిర్వహించిన ఈ దాడుల్లో తెలుగు గడ్డ పాత్ర కూడా ఉంది. నిజానికి కళ్లు పొడుచుకున్నా కనిపించని కారు చీకట్లో శత్రువులను వేటాడడమంటే మాటలు కాదు. ఇందుకోసం అత్యాధునిక నైట్ విజన్ పరికరాలు అవసరం. వాటిని ఉపయోగించే భారత జవాన్లు ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశారు. ఈ నైట్ విజన్ పరికరాలను కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) ఉత్పత్తి చేస్తోంది. 44 ఏళ్లుగా సేవలందిస్తున్న ఈ సంస్థ ఒకప్పుడు ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీగా ఉండేది. ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ టీచర్‌గా పనిచేసిన అయ్యగారి రామ్మూర్తి పంతులు 1926లో దీనిని ప్రారంభించారు. 1972లో దీనిని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్)గా మార్చి జాతికి అంకితం చేశారు. ఈ కంపెనీలో మొత్తం 16 రకాల రక్షణ పరికరాలు ఉత్పత్తి అవుతున్నాయి. అర్జున్ యుద్ధ ట్యాంకులకు అమర్చే కొన్ని పరికరాలను కూడా ఇక్కడే ఉత్పత్తి చేస్తున్నారు. ఇక బెల్ ఉత్పత్తి చేస్తున్న ‘థర్మల్ ఇమేజర్’ ద్వారా రాత్రి వేళల్లో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువులను కూడా కనిపెట్టవచ్చు. ‘ఇంటిగ్రేటెడ్ అబ్జర్వేషన్ ఎక్విప్‌మెంట్’ను కూడా ఇక్కడే అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఐదెకరాల్లో ఉన్న ఈ కంపెనీని విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.