: భారత్ కొట్టిన దెబ్బకు దిగివచ్చిన పాకిస్థాన్.. సార్క్ సదస్సు వాయిదా!
భారత్ కొట్టిన దెబ్బతో పాకిస్థాన్ కు దిమ్మతిరిగింది. యూరీ సెక్టార్ పై ఉగ్రదాడికి పాల్పడిన వెంటనే రంగంలో దిగిన ప్రధాని నరేంద్ర మోదీ సార్క్ సదస్సుకు హాజరయ్యేది లేదని తేల్చిచెప్పారు. ఆ వెంటనే భూటాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలు తాము కూడా భారత్ వెంటే ఉన్నామని, పాకిస్థాన్ తక్షణం ఉగ్రవాద అనుకూల చర్యలు మానుకోవాలని, ఉగ్రవాదాన్ని అరికట్టేదిశగా కదలాలని సూచిస్తూ సార్క్ సదస్సుకు రామని తేల్చిచెప్పాయి. ఎట్టకేలకు శ్రీలంక, మాల్దీవులు కూడా భారత్ వెంటే ఉన్నామన్న సంకేతాలు ఇస్తూ, సార్క్ సదస్సుకు రాలేమని పాకిస్థాన్ కు తెలిపాయి. చైనాకు మద్దతు పలుకుతున్న శ్రీలంక కూడా సార్క్ సమావేశాలకు రామని చెప్పడంతో తీవ్ర ఆలోచనలో పడిన పాకిస్థాన్ సార్క్ సమావేశాలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సదస్సు ఎప్పుడు నిర్వహించనున్నదీ త్వరలో వెల్లడించనున్నామని పాక్ అధికారులు ప్రకటించారు. కాగా, ఇస్లామాబాద్ లో నవంబర్ 9, 10వ తేదీల్లో 19వ సార్క్ శిఖరాగ్ర సదస్సు జరగాల్సి ఉంది. దీంతో ఈ సదస్సులో పాల్గొనేందుకు పాకిస్థాన్ తో పాటు ప్రస్తుతం దీనికి నేతృత్వం వహిస్తున్న నేపాల్ సిద్ధంగా ఉంది. సభ్యదేశాలు హాజరకాలేమని తెలిపిన నేపథ్యంలో సార్క్ సమావేశాలు వాయిదా పడ్డాయి.