: జీహెచ్ఎంసీకి షాక్...నోటీసులిచ్చాకే కూల్చండి: హైకోర్టు
హైదరాబాదును వర్షాలు ముంచెత్తడంతో నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి నగర వాసులను తీవ్ర ఇక్కట్ల పాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలలను ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలు కూల్చేసేందుకు జీహెచ్ఎంసీ రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు అక్రమ కట్టడాలను కూల్చివేయడం ప్రారంభించింది. ఎలాంటి పైరవీలకు అవకాశం లేదని, కూల్చేయాలని మీడియా ముఖంగా అధికారులను వీరు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్రమకట్టడాల కూల్చివేత విషయంలో జీహెచ్‌ఎంసీకి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఇందులో అక్రమ నిర్మాణాలు కూల్చేముందు వాటి యజమానులకు నోటీసులు జారీచేయాలని సూచించింది. ఆ కట్టడాలపై వివరణ ఇచ్చేందుకు నిర్మాణదారులకు మూడు వారాల గడువు ఇవ్వాలని ఆదేశించింది. గడువు ముగిశాక ఎందుకు కూల్చివేస్తున్నారో ఉత్తర్వుల్లో వివరణ ఇచ్చి కూల్చివేయాలని సూచించింది. జీహెచ్ఎంసీ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు నిర్మాణదారులకు అందేవరకు కూల్చివేతలు చేపట్టవద్దని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.