: ఆసుపత్రిలో ఉన్న జయలలిత ఫొటోలు విడుదల చేయండి.. అవాంఛనీయ పుకార్లు వస్తున్నాయి: కరుణానిధి

ఆసుపత్రిలో ఉన్న జయలలిత ఫోటోలు విడుదల చేసి, తమిళనాడులో వస్తోన్న పుకార్లలో వాస్తవం లేదని రాష్ట్ర ప్రభుత్వం నిరూపించుకోవాలని డీఎంకే అధినేత కరుణానిధి డిమాండ్ చేశారు. జ్వరంతో బాధపడుతున్నారంటూ కొన్ని రోజుల క్రితం జయలలితను చెన్నై ఆసుపత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ఆమె ఆసుపత్రిలోనే వున్నారు. ఈ నేపథ్యంలో, జయలలిత ఆరోగ్యంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాల్సిందేనని కరుణానిధి అన్నారు. జయలలితకు సంబంధించిన ఫొటోలు ఎందుకు విడుదల చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆమె ఆరోగ్యం విషయంలో గోప్యత వీడాలని ఆయన డిమాండ్ చేశారు. గోప్యత వల్లే జయలలిత ఆరోగ్యంపై అవాంఛనీయ పుకార్లు వస్తున్నాయని ఆయన అన్నారు. మరోవైపు జయలలిత ఆరోగ్యంగా ఉన్నారని అపోలో ఆసుపత్రి వైద్యులు తాజాగా మరో బులిటెన్ విడుదల చేశారు. మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాలని సూచించినట్లు తెలిపారు. ఆమె త్వరలోనే ఇంటికి వెళతారని పేర్కొన్నారు.