: విత్తన సంస్థల నుంచి పరిహారం రాబడతారా?.. లేక సర్కారే ఇస్తుందా?: రేవంత్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో కల్తీ విత్తనాలు విక్రయిస్తోన్న వ్యాపారుల వల్ల రైతులు ఎంతగానో నష్టపోతున్నారని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ సర్కారు రైతులకు ఏ విధంగానూ న్యాయం చేయలేకపోతోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన భాండాగారం చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారని, మరోవైపు నకిలీ విత్తనాలతో 3 లక్షల ఎకరాల పంట నష్టం వాటిల్లిందని ఆయన విమర్శించారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో నకిలీ విత్తనాలతో పంట నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు. రైతులకు వాటిని అంటగట్టిన కంపెనీలపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పంటనష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. నకిలీ విత్తనాలపై నిపుణులు ఇస్తున్న నివేదికను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. విత్తన సంస్థల నుంచి పరిహారం రాబడతారా? లేక తెలంగాణ సర్కారే ఇస్తుందా? అని ప్రశ్నించారు.