: భారత్ బాటలోనే శ్రీలంక.. సార్క్ సదస్సు కోసం పాక్ కు రాబోమని ప్రకటన
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో నవంబరు 9, 10 తేదీల్లో సార్క్ సదస్సును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ సదస్సును విజయవంతంగా నిర్వహించడానికి సభ్య దేశాలు సహకరించాలని ఓవైపు నేపాల్ కోరుతుండగా, మరోవైపు ఆ సదస్సుకు హాజరుకాబోమని సభ్య దేశాలు ప్రకటిస్తూ వస్తున్నాయి. ఇప్పటికే పాక్ లో జరగనున్న సార్క్ సదస్సుకు హాజరు కాబోమని భారత ప్రభుత్వం కుండలు బద్దలు కొట్టినట్లు చెప్పేసింది. ఆ తరువాత వరుసగా బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్గనిస్థాన్ దేశాలు కూడా అదే మాటను చెప్పాయి. అయితే, భారత సైనికులు పాక్ ఆక్రమిత కశ్మీర్ లోకి ప్రవేశించి ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన నేపథ్యంలో తాజాగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులలో శ్రీలంక కూడా సార్క్ సదస్సుకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఈరోజు శ్రీలంక అధికారికంగా ప్రకటించింది.