: పాకిస్థాన్ శాంతికాముక దేశం.. యుద్ధానికి నో చెప్పండి: పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ
భారత సైనికులు పాక్ ఆక్రమిత కశ్మీర్ లోకి ప్రవేశించి ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన నేపథ్యంలో ఇటు భారత క్రికెటర్లు అటు పాకిస్థాన్ క్రికెటర్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ ఇదే అంశంపై స్పందించాడు. గతంలో అఫ్రిదీ భారత్‌లో పర్యటించిన సందర్భంగా తాను క్రికెట్ ఆడిన అన్ని దేశాలకంటే భారత్‌లో ఆడటమే గొప్పగా భావించానని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పాక్ యావత్తు ఆయనపై విరుచుకుపడింది. కొన్ని నెలల క్రితమే ఆయన తన క్రికెట్ జీవితానికి గుడ్‌బై చెప్పారు. ప్రస్తుతం ఆయన సామాజికసేవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇరు దేశాల మధ్య చర్చల ద్వారా వివాదాలు పరిష్కరించుకోవాలని అన్నాడు. ఓవైపు ఈ విధంగా సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉండగా మరోవైపు యుద్ధంలాంటి పరిస్థితులు తలెత్తేలా వ్యవహరించడం ఎందుకు? అని అఫ్రిదీ ప్రశ్నించాడు. పాకిస్థాన్‌ని శాంతికాముక దేశంగా అభివర్ణించిన ఆయన... ఇండియాతో ఆ దేశం సత్సంబంధాలను కోరుకుంటోందని పేర్కొన్నాడు. ఇరు దేశాల మధ్య యుద్ధమే వస్తేగనుక భారత్, పాక్ ఎంతో నష్టపోతాయని అన్నాడు. యుద్ధానికి నో చెప్పండి అని సూచించాడు.