: ఆయనతో సమావేశం వుంటే హెల్మెట్ ధరించి వెళతా!: మహారాష్ట్ర సీఎంపై ఎంపీ సుప్రియా సూలే సంచలన వ్యాఖ్యలు
వీధుల్లోని కుళాయిల దగ్గర మహిళల్లా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గొడవపడతారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే సంచలన వ్యాఖ్యలు చేశారు. పుణెలో జరిగిన ఎన్సీపీ మహిళా కార్యకర్తల సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఫడ్నవీస్ కు కోపం ముక్కుమీద ఉంటుందని అన్నారు. తాను చాలా మంది ముఖ్యమంత్రులను చూసినా ఇలాంటి ముఖ్యమంత్రిని చూళ్లేదని ఆమె చెప్పారు. ఆయన ఎవరి మాటా వినరని ఆరోపించారు. ఒకవేళ ఆయనతో తప్పని సరి పరిస్థితుల్లో సమావేశం కావాల్సి వస్తే, తాను హెల్మెట్ ధరించి ఆ సమావేశంలో పాల్గొంటానని చెప్పింది. కోపంతో ఆయన ఏ వస్తువు విసురుతాడో తెలియదు కనుక హెల్మెట్ తోనే హాజరవుతానని ఆమె చెప్పారు. నీటికోసం కుళాయిల వద్ద మహిళలు పోట్లాడుకున్నట్లుగా ఫడ్నవీస్ గొడవ పడతారని ఆమె ఎద్దేవా చేశారు. పైగా ఈ వ్యాఖ్యలు ముఖ్యమంత్రికి తెలిసేలా ప్రసారం చేయాలని ఆమె మీడియాకు సూచించారు. దీంతో ఇది వివాదంగా మారింది.