: కావేరీ జల వివాదం: కర్ణాటకకు సుప్రీంలో మరోసారి భంగపాటు... ఇదే చివరి అవకాశమని సుప్రీం వ్యాఖ్య
కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరీ నదీ జలాలపై ఏర్పడ్డ వివాదం కేసు ఈరోజు మరోసారి సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. కర్ణాటకకు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో మరోసారి భారీ షాక్ తగిలింది. తమిళనాడుకు రేపటి నుంచి ఆరురోజుల వరకు కావేరీ జలాలను విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమిళనాడుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. సుప్రీం ఇప్పటికే ఈ ఆదేశాలని జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, కర్ణాటకలో ప్రజలనుంచి వస్తోన్న తీవ్ర వ్యతిరేకత కారణంగా సుప్రీం ఆదేశాలను కర్ణాటక పక్కనబెట్టింది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకున్న సుప్రీంకోర్టు తామిచ్చిన తీర్పును అమలు చేసేందుకు ఇదే చివరి అవకాశమని హెచ్చరించింది. అంతేగాక, మంగళవారంలోపు కావేరి యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్రానికి కూడా ఆదేశాలు జారీ చేసింది. రేపటిలోగా బోర్డు సభ్యులను నామినేట్ చేయాలని తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, కర్ణాటక ప్రభుత్వాలకు సూచించింది.