: జవాన్ల కుటుంబ సభ్యుల మనసులు కుదుటపడ్డాయ్


తమ కుటుంబాలకు ఆధారమైన వారిని పోగొట్టుకుని భారమైన మనసులతో ఉన్న అమర జవాన్ల కుటుంబ సభ్యులకు... భారత సైన్యం జరిపిన దాడులు కొంచెం ఊరటనిచ్చాయి. ఈ నెల 18న ఉరీలోని ఆర్మీ శిబిరంపై పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన ఉన్మాద దాడిలో 19 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. నాటి ఘటనలో అమరులైన వారి కుటుంబ సభ్యుల్లో సైన్యం దాడుల పట్ల హర్షం వ్యక్తమవుతోంది. సునీల్ కుమార్ విద్యార్థి అనే జవాన్ ను కోల్పోయిన అతడి భార్య కిరణ్ ఉత్తరప్రదేశ్ లోని గయ జిల్లా బోక్నారి గ్రామంలో నివసిస్తున్నారు. భారత సైన్యం దాడులపై ఆమె స్పందిస్తూ... సైన్యం దాడులు తమ మనసులకు ఓదార్పునిచ్చాయని తెలిపారు. కిరణ్ కుమార్తె ఆర్తి అయితే దేశంలో అశాంతికి కారణమవుతున్న ముష్కర మూకల ఆట కట్టించే విషయంలో ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనివ్వాలని డిమాండ్ చేసింది. తన తండ్రి మరణానికి కారకులైన వారిని ఉరితీయాలని కోరింది. అలాగే నాటి దాడిలో మృతి చెందిన జవాన్లు అశోక్ కుమార్ సింగ్ (భోజ్ పూర్), రాకేష్ సింగ్ (కైమూర్) కుటుంబ సభ్యులు కూడా సైన్యం జరిపిన దాడి సరైనదిగా పేర్కొన్నారు. అశోక్ కుమార్ సింగ్ భార్య సంగీతాదేవి మాట్లాడుతూ... ఉరీ దాడి సూత్రధారిని పాకిస్తాన్ నుంచి భారత్ కు పట్టుకొచ్చి శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి ఇటువంటి స్పందనను తాము ఆశిస్తున్నామని చెప్పారు. రాకేష్ సింగ్ భార్య కిరణ్ కుమారి మాత్రం ముష్కరులపై ఆపరేషన్ కొనసాగించాలని కోరారు.

  • Loading...

More Telugu News