: తిరుపతి వంటి పుణ్యక్షేత్రాల్లో స్వచ్ఛత నెలకొంది.. స్వచ్ఛంగా ఉన్నటోటే భగవంతుడు ఉంటాడు: మోదీ
ప్రభుత్వం మనది అనుకుంటేనే దేశం మనదనే భావన పెంపొందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశరాజధాని ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో ఈరోజు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్‌ను మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో పారిశుద్ధ్య సమ్మేళనం పేరిట నిర్వహించిన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ... దేశాన్ని చెత్త రహిత దేశంగా తీర్చిదిద్దడానికి అందరూ సంకల్పం చేపట్టాలని అన్నారు. తిరుపతి వంటి ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో స్వచ్ఛత నెలకొందని ఆయన వ్యాఖ్యానించారు. స్వచ్ఛంగా ఉన్నటోటే భగవంతుడు కొలువై ఉంటాడని మోదీ పేర్కొన్నారు. ప్రయాణికులు రైలు, బస్సు, ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణిస్తోన్న సమయంలో ఏదో రకంగా వాటికి నష్టం కలిగిస్తుంటారని మోదీ అన్నారు. మన సొంత వాహనాలను అయితే, అవి 20 ఏళ్లనాటి వాహనాలైనా కూడా వాటిని జాగ్రత్తగా చూసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ వాహనాలను నష్టపరచకూడదని సూచించారు. ప్రతి మనిషి ఓ సంకల్పాన్ని చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అలా చేస్తే దేశంలో మార్పు రావడం కష్టమేమీకాదని అన్నారు. దేశాన్ని స్వచ్ఛభారత్‌గా తీర్చిదిద్దడానికి అందరూ సంకల్పం చేపట్టాలని అన్నారు.