: స్వచ్ఛభారత్ పురస్కారాలు సాధించిన ప్రాంతాలు, సంస్థలు ఇవిగో!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛభారత్ కార్యక్రమం గాంధీ జయంతి రోజుకి రెండేళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా దేశరాజధాని ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో ఈరోజు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సమ్మేళనం పేరిట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా పలువురు స్వచ్ఛభారత్ పురస్కారాలను అందుకున్నారు. స్వచ్ఛ ఆసుపత్రిగా చంఢీగఢ్లోని టీజీఐఎంఈఆర్, స్వచ్ఛరైల్వే స్టేషన్‌గా సూరత్ నిలిచాయి. చెత్త నియంత్రణ కార్యక్రమాల్లో ఫలితాలు రాబట్టిన పుణె పట్టణానికి స్వచ్ఛతా పురస్కారం లభించింది. స్వచ్ఛ భారత్‌లో విశేష సేవలందించిన ఎన్సీసీ(నేషనల్ కేడెట్ కాప్స్) కి స్వచ్ఛతా పురస్కారం లభించింది. ఎన్సీసీ తరఫున ప్రధాని చేతుల మీదుగా మేజర్ జనరల్ ఏకేపీ విక్రమసింఘె పురస్కారం స్వీకరించారు. స్వచ్ఛ పాఠశాలగా డెహ్రాడూన్‌లోని కేంద్రీయ విద్యాలయం పురస్కారాన్ని అందుకుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రభుత్వ అధికారులు, పలు స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి.